అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.  వడదెబ్బతో ఒక్క రోజే ఎపిలో 21 మంది చనిపోయారు. ఒక్క విజయవాడలో పది మంది దుర్మరణం చెందారంటే ఏ విధంగా ఎండ మండిపోతోంది అర్థమవుతుంది. మృతులలో ఇద్దరు ఫౌరులు కాగా మిగిలిన ఎనిమిది మంది యాచకులుగా గుర్తించారు. ఆంధ్రాలో ఎండలు పగలు శగలు చిమ్ముతున్నాయి. ఎండల పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజుల నుంచి ఎండలు మరింత తీవ్రరూపం దాల్చాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో  పాటు  ఏకంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.


48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన ప్రతాపాన్ని తీవ్రస్థాయిలో చూపిస్తోంది. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తుండగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిడుగురాళ్లలో బుధవారం 47.6 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత, గురువారం మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఇక ఇతర ప్రాంతాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. బాపట్ల జిల్లా వేట పాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా టి.గుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి