
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యూ, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యూ సంఘాలు డిమాండ్ చేశాయి. దేశ రాజధాని ఢిలీల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు. 24న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు విద్యాసంస్థలు సహకరించాలని యాదవల్లి వెంకటస్వామి (ఎన్‌ఎస్‌యుఐ), కె. మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఎఐఎస్‌ఎఫ్), టి. నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ), పల్లె మురళి (ఎఐఎఫ్‌డిఎస్) విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు సహకరించాలని హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా 24న విద్యాసంస్థల బంద్ పోస్టుర్‌ను విద్యార్థి సంఘాల నేతలు విడుదల చేశారు.
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన క్రూరమైన లాఠీచార్జీ విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వెంకటస్వామి ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీలో విద్యార్థులపై బలప్రయోగం, ప్రజాస్వామ్య విలువలు, శాంతియుత నిరసన హక్కుపై తీవ్రమైన దాడి అని అభివర్ణించారు. దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన వరుస వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని, ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై స్వతంత్ర, సమగ్ర, పారదర్శక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యను మరింత కేంద్రీకరించే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యావ్యవస్థ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే విబిఎస్‌ఎ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.











