
ఎంబి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె లవర్స్’ పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు ముఖ్య పాత్రలను పోషించబోతున్నారు. ఈ మూవీకి రసూల్ భాయ్ కథను అందించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందజేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం.. దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. ‘రసూల్ అద్భుతమైన కథను ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా మూవీ ఉంటుంది‘అని తెలియజేశారు. నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ ‘తెలంగాణ యాసలో ఇది వరకు చూడని ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా ఉండబోతోంది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లినా కూడా వెంటాడేలా మా సినిమాలోని కథ ఉంటుంది. అందరినీ హత్తుకునేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత రసూల్, హీరో మోహిత్, హీరోయిన్ శృతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.











