
న్యూఢిల్లీ: దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే (హైడెన్సిసిటీ) ఏడు కీలక మార్గాల అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించింది. ఈ మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆ వివరాలను మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులు, సరకు రవాణా పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ఈ విస్తరణ చేపడుతున్నామని తెలిపారు.
దేశంలోని ఏడు హై-డెన్సిటీ రైల్వే మార్గాల్లో ఢిల్లీ-హౌరా, హౌరా-చెన్నై, చెన్నై-ముంబై, ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ముంబై-హౌరా, ఢిల్లీ-గువాహటి ఉన్నారు. ఇవి దాదాపు 11 వేల కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ఇవి కేవలం 16 శాతం అయినప్పటికీ , దేశవ్యాప్తంగా జరుగుతున్నరైలు రవాణాలో సుమారు 41 శాతం ఈ మార్గాల ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ మార్గాల్లో అదనపు రైల్వే లైన్ల ఏర్పాటు అత్యంత ప్రాధాన్యంగా మారింది. దీంతో అత్యంత రద్దీగా ఉన్న మార్గాల్లో మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కలగడంతో పాటు ప్రయాణికులు, సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనున్నట్టు మంత్రి వెల్లడించారు. హెడెన్సిటీ మార్గాల నాలుగు లైన్ల విస్తరణతో దేశ రైల్వే వ్యవస్థకు దీర్ఘకాలిక సామర్థ్యం లభించనుందని తెలిపారు. తక్కువ రవాణా వ్యయం, పర్యావరణహిత రవాణా లక్ష్యాలకు దోహదపడుతుందన్నారు.











