శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం రాత్రి వరకు 150 టీఎంసీల మేరకు నీరు చేరుకుంది. మరో 65 టీఎంసీల మేర నీరు చేరితే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండుతుంది. ఎక్కువ కర్ణాటక నుంచి కృష్ణా బేసిన్‌కు వస్తున్న వరద యథావిథిగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం జలాశయానికి రేపటి వరకు మరో 20 టీఎంసీల మేర నీరు చేరే అవకాశాలున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 215.8070 టీఎంసీలకు గాను గురువారం రాత్రి వరకు 150 టీఎంసీల మేర నీరు చేరుకుంది.885 అడుగులకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872 అడుగులకు నీరు చేరుకుంది.

దీంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు 1 లక్ష 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో 1,50,000 క్యూసెక్కుల ఎక్కువ నీటిని దిగువ నారాయణపూర్ ద్వారా జూరాల ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు గురువారం 2 లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. జూరాల ప్రాజెక్టు అధికారులు 28 గేట్లను ఎత్తి దిగువకు 1, 89 వేల క్యూసెక్కులను వదులుతుండగా జల విద్యుత్ ఉత్పత్తి అనంతరం మరో 28 వేల క్యూసెక్కులను శ్రీశైలం వైపునకు వదులుతున్నారు. రాష్ట్రానికి చెందిన శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 3.435 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.