
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కెటిఆర్ అన్నారు. తనకు జయశంకర్ సార్‌తో పదేళ్ల పాటు కలిసి పనిచేసే అదృష్టం దక్కిందని ఆయన తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా, గొప్ప ఉపాధ్యాయుడు అని కొనియాడారు. ఇప్పుడు మనం తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను తెలంగాణ జాతిపితగా గౌరవించుకుంటున్న తీరుగానే, ఉద్యమకాలంలో కెసిఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తనకు ఒక గాడ్ ఫాదర్‌గా భావించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమయంలో జయశంకర్ సార్ కెసిఆర్‌కు గాడ్ ఫాదర్‌లా మార్గనిర్దేశనం చేశారని చెప్పారు. స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ సార్ విశ్లేషించారని పేర్కొన్నారు. పాలమూరు వెనుకబాటుతనాన్ని కూడా అదే కోణంలో వివరించారని అన్నారు. 2006, 2008 ఉప ఎన్నికల సమయంలో ఉద్యమానికి భావజాల వ్యాప్తి, ఆందోళన, డెమోక్రటైజేషన్ అనే మూడు పార్శ్వాలు ఉన్నాయని జయశంకర్ సార్ చెప్పారని గుర్తు చేశారు. ‘యాచించి కాదు.. శాసించి తెలంగాణ సాధించాలి’ అనే ఆలోచనను ఆయన కెసిఆర్‌లో నూరిపోశారని అన్నారు. 2009 నవంబర్ 29న కెసిఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజు జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేసుకున్నారు.
కెసిఆర్ అరెస్టు, హన్మకొండలో ధర్నా, జయశంకర్ సార్ ఇంటికి వెళ్లిన ఘటనలు తన జీవితంలో భావోద్వేగ క్షణాలని చెప్పారు. ‘ఉద్యమం భాస్వరంలా మండుతుంది.. తెలంగాణ తప్పక వస్తుంది’ అని జయశంకర్ సార్ తమకు ధైర్యం చెప్పారని, శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పారు. ఢిల్లీలో జాతీయ మీడియాకు తెలంగాణ చరిత్రను, హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేకతను, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను, ఆంధ్ర- తెలంగాణ విలీనానికి గల కారణాలను జయశంకర్ సార్ ఆధారాలతో వివరించేవారని తెలిపారు. కెసిఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని జయశంకర్ సార్ బలంగా నమ్మేవారని అన్నారు. తెలంగాణ ప్రజలను చిన్నబుచ్చే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టడమే పదవీ త్యాగాలతో పుట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ చేతిలో మళ్లీ రాష్ట్రాన్ని పెడదామని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం బిఆర్‌ఎస్ నిరంతరం పనిచేస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.











