
హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో యువతను మోసం చేశాయని బిజెపి ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సులో యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ ను రాష్ట్రంలో ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కెటిఆర్, సిఎం రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, 9 ఏళ్ల లో రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేశాయి? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కెటిఆర్ అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని, బిజెపి గురించి మాట్లాడే హక్కు..బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని మండిపడ్డారు. మాయ మాటలకు కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.











