
మనతెలంగాణ/జనగాం ప్రతినిధి : 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని టీచర్ ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ విడుదలై, అనంతరం నియామకం పొందిన 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెం. 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. పిఆర్‌టియుటిఎస్ జనగాం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ అవార్డులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, 2003 డిఎస్‌సి టీచర్ల విషయంలో అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో ఎస్‌ఎల్‌పి వేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎస్‌ఎల్‌పిని వెనక్కి తీసుకొని, 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కార్యక్రమంలో పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, పధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.














