
టి-20 ప్రపంచకప్‌ను టీం ఇండియాకు అందించిన సరే.. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు జట్టు తప్పగాలు అప్పగించారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ విషయంపై సూర్య స్పందించాడు. తనను కెప్టెన్సీ తప్పించారని తెలిసి నవ్వుకున్నాను అని సూర్య అన్నాడు. ఒలింపిక్స్‌తో పాటు వచ్చే టి-20 ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపిస్తానని తాను తొలుత అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ, సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు.
‘‘జట్టు సారథిగా నా పేరు లేదని తెలిసినప్పుడు నవ్వానంతే. క్రికెట్ ఆడుతున్నప్పుడు.. ఒత్తిడి ఉన్న ప్రతి సందర్భంలో నవ్వుతూనే ఉన్నా. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అలాగే నాకు ఆడే అవకాశాలు లభించిన ప్రతిసారీ కృతజ్ఞతతోనే ఉన్నా. నిజానికి.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. 2026లో కప్ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్లూ ఈ జట్టును నేనే నడిపిస్తానని అనుకున్నా. రాబోయే ఒలింపిక్స్‌లోనూ జట్టుకు సారథ్యం వహిస్తానని భావించా. అయితే, ఇతరుల ఆలోచరనలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి నిర్ణయాలను మనం గౌరవించాలి. ఈ జట్టు మరొకరి సారథ్యంలో రాణిస్తే మంచిదే కదా. నేను శ్రేయస్‌తో కలిసి చాలా మ్యాచులు ఆడా. అతడు చాలా మంచి ప్లేయర్. మంచి సారథి కూడానూ. అతడిని ఎందుకు సారథిని చేశారని ఎప్పుడూ అనుకోను. కానీ, కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు నాకు కాస్త బాధ కలిగింది. రెండేళ్లలో ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. వరల్డ్ కప్, ఆసియా కప్‌లనూ గెలిచాం. అంతా బాగున్నప్పుడు మార్పునకు కారణం ఏంటో? ఇదే నా మనసులో తిరుగుతూ ఉండేది. దాదాపు నెలన్నర పాటు ఇంట్లోనే ఉండిపోయా’’ అని సూర్య తెలిపాడు.








