
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సభను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు సంగ్రామ సభ ఎందుకు నిర్వహించారో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పాలని ఏలేటి ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
బిఆర్‌ఎస్ బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని, ప్రజలను మోసగించడంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇద్దరు కలిసి జగన్నాటకం ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒకరిది అధికార దాహం.. మరొకరిది ధన దాహం అని ఆయన విమర్శించారు. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం బిఆర్‌ఎస్ నిర్వహించిన సభలో కెటిఆర్ మొసలి కన్నీరు కార్చారని ఆయన విమర్శించారు.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ సింగరేణి దివాళా తీసేలా చేశాయని ఆయన విమర్శించారు. విద్యార్థులకు ఫీ-రీయంబర్స్‌మెంట్ చేయలేదని, పదవీ విరమణ చేసిన వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని ఏలేటి తూర్పారపట్టారు.











