
ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి శుక్రవారంనాడు ప్రకటించింది. జూలైలో కాస్త పరిస్ధితులు మెరుగుపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఐఎండి చేసిన ప్రకటన నిరాశపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఓ మోస్తరు ఎల్‌నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని ఐఎండి హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నెలవారీ సమాచారంలో భాగంలో ఆగస్టు నెలలో భారతదేశంలో సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 94% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయినా వాయువ్య, ఈశాన్య, తూర్పు-మధ్య, తూర్పు ద్వీపకల్ప ప్రాంతంలోని కొన్ని భాగాలలో సాధారణం నుండి అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన కాలం రెండవ భాగంగా భావించే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలిపినా వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఎల్ నినో ఆగస్టు నెల మొత్తం మధ్యస్థ తీవ్రతతో కొనసాగి, సెప్టెంబరులో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.











