జమ్మూ కశ్మీర్‌లో 13మంది, నాగాలాండ్‌లో 8 మంది మృతి

పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలైన రాజౌరి, పూంచ్ జిల్లాలను ఆకస్మిక వరదలు బెంబేలెత్తించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనావాసాల్లోకి నీరు చేరింది. దీంతో పలుచోట్ల నివాస భవనాలు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల రహదారులు తెగిపోయి, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నూతనంగా నిర్మించిన బస్టాండ్ నీటమునిగింది.

జమోలా, దార్హలి, ఖాండ్లీ తదితర నదులు ఉపొంగి ప్రవహిస్తోంది. చీనాబ్ నదికి వరదలు పోటెత్తడంతో గేట్లు ఎత్తి అధికారులు వరద జలాలను దిగువకు వదులుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు. ఈ నెల 23 వరకు జమ్మూ కశ్మీర్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

నాగాలాండ్‌లో 8 మంది మృతి..

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. గల్లంతైన మిగిలిన వారి కోసం ఆ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.