న్యూఢిల్లీ: కృత్రిమ మేధ దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా బెదిరింపులు, ఆదేశాలతో ఆంథ్రోపిక్స్ తమ ఎఐ అనుబంధ టూల్స్ వేదికలు ఫ్యాబిల్ 5, మిథోస్ 5ల సేవలను నిలిపివేసింది. దేశ జాతీయ భద్రతా అంశాలతో అమెరికా ఈ కంపెనీకి గట్టి చురకలు పెట్టింది. ఆయా అనుబంధ విభాగాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఎగుమతుల నియంత్రణ ఆదేశాలు కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్స్ ఎఐ అధునాతన సృష్టి విభాగాలను ఉపసంహరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్‌కు ఈ విషయం తెలియచేసింది.

ఎఐ సంస్థలకు ఈ విధంగా అమెరికా తన తొలి దెబ్బ ఇచ్చింది. ఆకపై ఈ విభాగాలకు సంబంధించి ఎవరు కూడా సేవలు అందుకోవడానికి వీల్లేదని, ఇది అమెరికాలోనూ, వెలుపల కూడా ఉన్న కస్టమర్లందరికీ వర్తిస్తుందని తెలిపారు. తాము ఇప్పుడు అర్థాంతరంగా వీటి సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని సంస్థ తమ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తమ సంస్థకు చెందిన ఇతరత్రా సేవలు కల్పిస్తామని వివరించారు. మొత్తం మీద వినియోగదారులకు అసౌకర్యం ఏర్పడిందని అంగీకరించారు. ఆంథ్రోపిక్స్ సేవలలో భారతదేశం ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత నిర్ణయంతో భారత్‌లోని వేలాది మంది యుజర్లపై ప్రభావం పడుతుంది.

ఇప్పుడు ఆంథ్రోపిక్ నిలిపివేసిన వాటిలో ఫ్యాబిల్ 5 సేవలు మూడురోజుల క్రితమే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ అనుబంధ మోడల్స్ లేదా టూల్స్‌తో హ్యాకర్లు కీలక రహస్యాల ఛేదనలో ముందుకు సాగుతారని ట్రంప్ అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రత్యేకించి విదేశీ యుజర్లకు వీటి సౌకర్యం నిలిపివేయాలని ఆదేశించింది. అయితే తమకు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ వెలువరించిన ఆదేశాలు, ఆందోళనను పరిశీలించామని , అయితే సాఫ్ట్‌వేర్ చొరబాట్లకు వీల్లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ దేశ పౌరుల వ్యక్తిగత భద్రత, వారి గోప్యత నేపథ్యంలో రిస్క్ లేకుండా ఉండేందుకు తగు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేవలం విదేశీయులకే కాకుండా అమెరికాలోని వారికి కూడా వీటి సేవలను నిలిపివేశారు. తాజాగా వచ్చిన ఆంథ్రోపిక్ మోడల్స్ సేవలపై భారతదేశంలో ఇప్పటికే టిసిఎస్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టూల్స్ కోసం ఏకంగా అరలక్ష మంది ఉద్యోగులను తీసుకుంది.

పలు ఇతర సంస్థలు కూడా ఈ కొత్త టూల్స్ కోసం ఎగబడ్డాయి. ఇప్పుడు వీటికి చుక్కెదురైంది. ఇన్ఫోసిస్ కూడా సంబంధిత విషయంలో డీల్ కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం అయ్యాయి. భారత ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కృత్రిమ మేథ పరిజ్ఞానం పట్ల మక్కువ చూపాయి. అయితే అమెరికాకు చెందిన ఎఐ సంస్థల పరిజ్ఞానంతో భారతీయ బ్యాంకులు, ఇతర కీలక సంస్థలపై సైబర్ అటాక్‌లు ఎక్కువ అవుతున్నాయని ఎప్రిల్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో కూడా అమెరికా స్పందించినట్లు వెల్లడైంది. ఇప్పుడు తాము తీసుకున్న నిర్ణయం అసాధారణం అని కస్టమర్లకు ఆంధ్రోపిక్ క్షమాపణలు తెలిపింది. అధికార యంత్రాంగం అపార్థం చేసుకుందని పేర్కొన్నారు. తొందరలోనే లోపాలు దిద్దుకుని ముందుకు వస్తామని తెలిపారు.