న్యూయార్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భాగవత్ ఈ నెల 29న న్యూయార్క్లోని మ్యాడిసన్ స్క్వేర్ వద్ద ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ మంగళవారం స్పష్టం చేశారు. అయితే అది ప్రైవేటు కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో తనకు తెలియదని చెప్పారు.

భారతీయ సంతతికి చెందిన మమ్దానీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో భాగవత్ నిర్వహించనున్న ర్యాలీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సభకు నేను మద్దతు ఇవ్వను. అయితే ప్రైవేటు కార్యక్రమాన్ని రద్దు చేసే అధికార పరిధి నగరానికి ఉందో లేదో నాకు తెలియదు అని అన్నారు. తన కుటుంబం ద్వారా తాను తెలుసుకున్న, పెరిగిన భారతదేశం బహుళత్వ సమాజం, లౌకిక గణతంత్రం అని మమ్దానీ పేర్కొన్నారు.

భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా చోటు ఉండాలన్న భావనతో కూడిన దేశంగా తాను భారత్‌ను చూశానన్నారు. వెలివేతతో కూడిన దృక్పథంపై ఆధారపడిన ఉద్యమం పెరుగుతుండటం నన్ను తీవ్రంగా కలచివేసింది అని మేయర్ అన్నారు. తాను భారతీయ- అమెరికన్‌గా మాత్రమే కాకుండా.. రంగు, కులం, మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా వారు ఏ ప్రాంతానికి చెందినవారైనా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, స్థానం ఉండాలని గట్టిగా విశ్వసించే నగరానికి మేయర్‌గా కూడా అలాంటి దృక్పథాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. మమ్దానీ న్యూయార్క్ నగర చరిత్రలో తొలి భారతీయ- అమెరికన్ మేయర్‌గా తనను తాను అభివర్ణించుకున్నారు. ఆయన తల్లి కుటుంబం ఇప్పటికీ భారత్‌లోనే ఉందని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా భాగవత్ అమెరికాలో పర్యటిస్తున్నారు. మంగళవారం అమెరికాకు చేరుకున్న ఆయన పర్యటనలో కెనడా, బ్రిటన్ కూడా ఉన్నాయి. అమెరికాలో ఆగస్టు 29న న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ (ఎంఎస్‌జీ)లో దాదాపు 5,000 మందితో జరిగే కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంపై పలు మానవ హక్కుల సంస్థలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్ ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ తదితర మతాంతర, పౌర హక్కుల సంస్థలు భాగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఎంఎస్‌జీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కూడా అవి కోరాయి. యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్ పేరుతో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజా విధానాలు, పరిశోధన సంస్థ ‘ఆహెడ్ ఫోరం’ నిర్వహిస్తోంది. ప్రపంచం ఒకే కుటుంబం అనే శాశ్వత, సార్వత్రిక సందేశాన్ని భాగవత్ పర్యటన అందిస్తుందని సంస్థ సామాజిక మాధ్యమ వేదికలో పేర్కొంది. కృత్రిమ విభజనలు, భేదాలకు అతీతంగా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. భాగవత్ ప్రస్తుత విదేశీ పర్యటన ఉద్దేశం భారత్, హిందూ సమాజం, ఆర్‌ఎస్‌ఎస్‌పై వాస్తవికమైన, సానుకూల దృక్పథాన్ని ప్రపంచానికి వివరించడమేనని సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శి సీఆర్ ముకుంద గత వారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో తెలిపారు.