రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పల్లెవాసుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా, సేవలను వారి ముంగిటకే చేర్చాలనే దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు గాను 1,569 నూతన ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను చేపట్టనున్నారు.

అంతేకాకుండా, సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత నిర్ధారణ (డయాగ్నస్టిక్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అయ్యే వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా వైద్య సేవల అందుబాటు, నాణ్యత గణనీయంగా పెరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది.