హైదరాబాద్: పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షిస్తాడు అంటారు. కానీ తల్లిదండ్రులను కుమారుడు చంపి నరకానికి పంపించాడు.  మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని కుమారుడు కొట్టి చంపిన సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గాంధీనగర్ లో రజియా బేగం(60) తన కుమారుడు ఆసిఫ్ తో కలిసి ఉంటుంది. ఆసిఫ్ మద్యానికి బానిసగా మారి వింతగా ప్రవర్తించేవాడు. మద్యానికి డబ్బుల కోసం ప్రతి రోజు తల్లిని ఆసిఫ్ వేధించేవాడు. ఆదివారం మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని కుమారుడు కోరారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తలిపై కుమారుడు పిడిగుద్దుల వర్షం కురిపించడంతో అక్కడికక్కడే చనిపోయింది. గ్రామస్థులు గమనించి ఆసిఫ్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆసిఫ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రెండు సంవత్సరాల మద్యం కోసం తండ్రితో గొడవ  పడి చంపాడు. ఇప్పుడు తల్లిని చంపాడు.