
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈనెల 24 నుంచి తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టిఆర్‌టియు) సహా పలు ఆటో యూనియన్ల నాయకులతో కలిసి ఆమె బంద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఆర్‌టిసి యాజమాన్యానికి ఈవీ ఆటోలు ఇచ్చి లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీస్ ప్రారంభించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీస్‌ను ఇప్పుడున్న ఆటోడ్రైవర్లతో నడిపించాలని డిమాండ్ చేశారు. ఆటో,ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలని పేర్కొన్నారు. ఓలా,ఉబర్, ర్యాపిడోలకు బదులుగా ప్రభుత్వమే యాప్ తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు.
శిశువు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి జీజీహెచ్ లో శిశువు మృతిపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే శిశువు మృతిచెందిందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు తరచు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. శిశువును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.











