లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో నాయకుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఇందులో భాగంగా 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి. 11 మంది రాష్ట్ర మంత్రులతో సహా పలువురు నేతలు ఉన్నారు. రాష్ట్రంలోని మరో 98 మంది నేతలు, ప్రముఖ వ్యక్తులకు వివిధ స్థాయిలో భద్రత కల్పించాలని కూడా యూపీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కాగా, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను రెండు దశల్లో అందించనున్నారు. మొదటి దశలో 8 మంది నేతలు, రెండో దశలో మరో 44 మందికి వీటిని అందజేస్తారు. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విలువ రూ.10 లక్షలని తెలుస్తోంది. 52 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడానికి ఏదైనా నిర్దిష్ట దాడి ముప్పు లేదా ప్రత్యేక నిఘా సమాచారం కారణమా అనేది వెంటనే తెలియలేదు. అయితే 2027 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు వంటి కార్యక్రమాల్లో జాతీయ పార్టీల అగ్రనేతలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉండటంతో రాజకీయల నాయకుల భద్రతపై యూపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.