సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో పర్యావరణ రక్షకుడు ‘దుశ్చర్ల సత్యనారాయణ’పై జరిగిన దాడి కేవలం ఒక భౌతిక దాడి కాదు, అది మన సామాజిక అట్టడుగువర్గాల మధ్య నెలకొన్న అవగాహనా రాహిత్యానికి, వనరుల వినియోగంలో, రక్షణలో ఉన్న వైరుధ్యానికి పరాకాష్ఠ. ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ అధ్యక్షునిగా, ఒక జర్నలిస్టుగా ఈ ఘటనను కేవలం దాడి ఘటనగానో ‘నేరం - శిక్ష’ కోణంలో కాకుండా, సామాజిక, పర్యావరణ కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న. ఈ ఘటనలో ఒకవైపు 70 ఎకరాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న పర్యావరణవేత్త ఉంటే, మరోవైపు తమ గొర్రెల మేతకోసం పరితపించే సామాన్య గొర్రెల కాపరులు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది... పర్యావరణ పరిరక్షణకూ, సామాజిక జీవనోపాధికీ మధ్య జరగాల్సిన సమన్వయం లోపించింది అనేది. దుశ్చర్ల సత్యనారాయణకు ఆ అడవి ఒక పవిత్ర క్షేత్రం. ఒక్కొక్క మొక్కను బిడ్డలా సాకారు. పశువులు అడవిలోకి వస్తే చిన్న మొక్కలు, ఔషధ గుణాలున్న పొదలు నాశనమవుతాయి.

ఇది ఆయన దశాబ్దాల తపస్సును బుగ్గిపాలు చేయడమే అవుతుంది. ఇక ఆ చెట్లను నరికే చర్యలను అడ్డుకోవటం సహజమే. గొర్రెల కాపరుల కోణంలో చూస్తే సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు పచ్చని గడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్లడం ఒక సహజాత ప్రవృత్తి. అయితే, ‘సొంత భూమి - పరాయి భూమి’, ‘పర్యావరణం - మేత’ అనే విభజన రేఖను వారు గుర్తించలేకపోవడం ఒక సామాజిక వైఫల్యం. దాడికి పాల్పడినవారు సామాజికంగా అట్టడుగువర్గాలకు చెందిన వారు కావడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. ప్రకృతిని ఎక్కువగా నమ్ముకుని బతికేది ఈ వర్గాలే. ఒక సామాజిక వర్గంగా గొర్రెల కాపరులకు అడవి విలువ తెలియకపోవడం మన విద్యా వ్యవస్థ, సామాజిక చైతన్య కార్యక్రమాల వైఫల్యమే. తమ పశువులకు గాలిని, నీటిని ఇచ్చేది ఆ అడవే అన్న స్పృహ ఉంటే.. వారు కర్రలతో ఆ పర్యావరణవేత్తపై దాడి చేసేవారు కాదు, గొడ్డళ్ళతో ఆ అడవిలోని చెట్లను నరికేందుకు సిద్ధపడేవారు కాదు. పైగా ఆయన్ని గౌరవించేవారు.

అయితే ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్యను కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిలా కాకుండా, గ్రామాల్లో పర్యావరణవేత్తలకు పశుపోషకులకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే దిశగా చూడాలి. గ్రామాల చుట్టూ ఉండాల్సిన ‘గోచర భూములు’ కనుమరుగవ్వడంవల్లే గొర్రెల కాపరులు ఇలాంటి అటవీ క్షేత్రాలపై పడుతున్నారు. పర్యావరణ కార్యకర్తలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి ప్రభుత్వం భద్రత కల్పించడమే కాకుండా, వారి కృషిని స్థానిక ప్రజలకు వివరించి, ప్రజలను కూడా ఆ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలి. ‘మీ ఆకలికి కారణం ఈ పర్యావరణ వేత్తలే’ అని అబద్ధపు ప్రచారాలు చేసి, స్థానిక ప్రజలనే పర్యావరణ ప్రేమికులపైకి ఉసిగొల్పే ప్రమాదం ఉంది. ఈ రోజు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి రేపు మరెంతో మంది పర్యావరణ కార్యకర్తలపై జరుగదనే గ్యారెంటీ లేదు.మీ పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని ఇచ్చేది ఆ గుట్టలు, అడవులే. ఆ సహజ వనరులను కాపాడే వారు మీకు శత్రువులు కాదు, మిత్రులు అని గమనించాలి.

అందుకే, పర్యావరణ రక్షణ కోసం పోరాడే వారికి అండగా నిలవాలి. ఏదేమైనప్పటికీ దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి రేపటి తరం పీల్చే ప్రాణవాయువుపై జరిగిన దాడిగా చూడక తప్పదు. ఇది ఒక వ్యక్తికి తగిలిన గాయం కాదు, ప్రకృతి సంరక్షణ అనే ఆశయానికి తగిలిన గాయం. దాడి చేసిన వారు సామాజికంగా వెనుకబడిన వారని మనం వారిని ఉపేక్షించలేం, అలాగని వారి ఆకలిని విస్మరించలేం. కానీ, చట్టాన్ని గౌరవించడం, ప్రకృతిని కాపాడే వారిని పూజించకపోయినా పర్వాలేదు కానీ హింసించకూడదు అనే కనీస స్పృహను కల్పించడంలో మనమంతా విఫలమయ్యాం. పోలీసు చర్యలతోపాటు, రాఘవాపురంలో ఒక సామాజిక చైతన్య యజ్ఞం జరగాలి. అనేక చోట్ల ప్రకృతి, పర్యావరణ రక్షణ కోసం, సహజ వనరుల పరిరక్షణ కోసం మాట్లాడుతున్న వారికి అటు చట్టం, ఇటు ప్రజలు రక్షణగా నిలువాల్సిన అవసరం ఉంది. 

- రాజేందర్ దామెర (జర్నలిస్టు)