
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది అని పేర్కొన్నారు. జెన్ జెడ్ అంటూ విక్టరీ సిబల్ చూపిస్తూ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత హరీష్‌రావు స్పందిస్తూ, దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం అని వ్యాఖ్యానించారు. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ , కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి,బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం అని అభివర్ణించారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. తరం మారుతోంది... ఇక అందరి వైపు చూస్తుందని పేర్కొన్నారు. లాఠీ ఛార్జ్ చేసినా, దమనకాండకు పాల్పడినా, దేశద్రోహులు అన్నా... కేంద్రం దిగి రాక తప్పలేదని అన్నారు. బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పందిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు,యువత, ప్రజాస్వామ్యవాదుల విజయమని వ్యాఖ్యానించారు.











