ప్రపంచ సాహిత్య చరిత్రలో ‘నేర కథా రచయిత్రి’గా అగాథా క్రిస్టీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. బైబిల్, షేక్‌స్పియర్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఆమె రచనలు ఉన్నాయనే రికార్డు ఆమె స్వంతం చేసుకున్నారు. అగాథా క్రిస్టీ 66 నవలలు, 14 కథా సంకలనాలు రాశారు . ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలం ప్రదర్శితమవుతున్న ‘ది మౌస్ట్రాప్’ నాటకం ఇవన్నీ ఆమె అపార ప్ర తిభకు నిదర్శనాలు. అయితే, ఈ వ్యాసం క్రిస్టీని కేవలం ‘క్రైమ్ క్వీన్’గా కాక, తన కాలంలోని సామాజిక, సాంస్కృతిక ప్రక్రియలతో సంభాషించిన ఒక సంక్లిష్ట రచయిత్రిగా పేరు సంపాదించింది. ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను, రచనా ప్రత్యేకతలను, సాహిత్య విమర్శకుల దృక్పథాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

అగాథా క్రిస్టీ వ్యక్తిగత జీవితంలోని అనేక సంఘటనలు ఆమె రచనలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫార్మసిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు విషాలపై అద్వితీయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. ఆమె నవలల్లో విషప్రయోగాలు చాలా వాస్తవికంగా, శాస్త్రీయంగా చిత్రీకరించబడటానికి ఇదే ప్రధాన కారణం. రెండవ వివాహం తర్వాత పురావస్తు శాస్త్రవేత్త మ్యాక్స్ మల్లోవాన్‌తో కలిసి మధ్య ప్రాచ్యంలో గడిపిన రోజులు ‘మర్డర్ ఇన్ మెసొపొటేమియా’, ‘డెత్ ఆన్ ది నైల్’ వంటి నవలలకు నేపథ్యంగా నిలిచాయి.

అయితే, ఆమె జీవితంలో అత్యంత రహస్యమైన, ఎంతో చర్చనీయాంశమైన ఘట్టం 1926లో జరిగిన ఆమె అదృశ్యం. తల్లి మరణం, భర్త వ్యభిచారం వల్ల కలిగిన మానసిక క్షోభతో అగాథా క్రిస్టీ దాదాపు పదకొండు రోజులపాటు ఎవరికీ కనిపించకుండా పోయింది. చివరకు ఆమె ఒక హోటల్లో ఆమె భర్త ప్రేయసి పేరుతో (మారు పేరుతో) రిజిస్టర్ అయిన ట్లు గుర్తించబడింది. ఈ ఘటన ఆమె జీవితంలోనే ఒక వాస్తవ నేర కథలా మారింది. సైకాలజీ విమర్శకుడు ’టిసన్పుగ్’ ఈ అనుభవాన్ని ఆమె రచనల్లోని ‘గుర్తింపు సంక్షోభం’ అలాగే ‘ద్వంద్వ జీవితాల’ నేపథ్యాలకు సంబంధించిన సంక్షుబిత విషయాలుగా పేర్కొన్నారు. క్రిస్టీ రచనలు సాధారణంగా ‘విషాదాం త సుఖాంతం’ (ట్రాజిక్ కంఫర్ట్)గా సాహిత్య విమర్శకులు వర్ణిస్తారు. ఉదాహరణకు ‘గోల్డెన్ ఏజ్’ నేర కథలకు ప్రతీకగా వారు భావించారు. ఒక స్థిరమైన సామాజిక వ్యవస్థలో జరిగిన హత్య, చివరికి అసాధారణ మేధస్సు గల డిటెక్టివ్ చేత పరిష్కరించబడి, సమాజంలోని క్రమం తిరిగి నెలకొల్పబడుతుంది.

కానీ ఇరవై ఒకటవ శతాబ్దపు విమర్శనాత్మక దృష్టితో చూస్తే, ఈ అభిప్రాయం ఆమె సృజనాత్మక ప్రయోగాలను అతి సూక్ష్మీకరిస్తుందని తెలుస్తుంది. జెస్పర్గుల్డాల్ వంటి పండితులు ఆమె నవలలు ‘సౌకర్యవంతమైన సంప్రదాయబద్ధత’కు వ్యతిరేకంగా పనిచేస్తాయని వాదిస్తారు. ఆమె నవలల్లో హంతకుడు సమాజం నుండి తొలగించబడే ఒక వ్యక్తిగత వికృతం కాదు. బదులుగా, ఆమె నిర్మించే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంభావ్య హంతకులే. ఈ దృక్పథం ఆమె కథలను కేవలం పజిల్స్‌గా కాక, మానవ స్వభావంపై ఒక చీకటి వ్యాఖ్యానంగా ఉంటుందని అంటారు. ఆమె సృజనాత్మకతకు మరొక ప్రత్యేకత ‘మెటాఫిక్షన్’ (తనను తాను ప్రశ్నించుకునే కథనం). దాదాపు అన్ని నవలల్లో, డిటెక్టివ్ సాక్ష్యాలను అన్వేషిస్తున్నట్లు చూపినా, నిజానికి కథానాయకుడిగా ఉండే కథకుడు అత్యంత నమ్మదగని వ్యక్తిగా మారడం (‘ది మర్డర్ ఆఫ్ రోజర్ అక్రాయిడ్’ లో వలె) ఆమె ప్రతిభను చాటుతుంది. ఇటువంటి కథన ప్రయోగాలు సమకాలీన ఉత్తర- ఆధునిక రచనలను తలపిస్తాయి.

నేటి సమాజంలో క్రిస్టీ రచనలు ఎందుకు ఇంత పాసంగిత కలిగి ఉన్నాయి? దీనికి మూలకారణం ఆమె చిత్రీకరించిన సమాజంలోని అసమానతలు, వర్గ విభేదాలు, లింగ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడమే. వార్విక్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు అగాథా క్రిస్టీ నవలలను ‘గోతిక్సంప్రదాయం’తో ముడిపెడుతూ, ఆమె రచనలు ‘గృహం’ (డొమిస్టిక్) అనే భావనను ఎలా సంక్లిష్టంగా మారుస్తాయో వివరిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ సమాజంలో ‘ఇల్లు’ అనేది ఇక ఏమాత్రం సురక్షితమైన కేంద్రం కాదు. అదే నేరానికి, అశాంతికి కేంద్ర బిందువు అవుతుంది. ‘ఎ మర్డర్ ఈజ్ అనౌన్స్‌డ్’లో చిన్నపాటి గ్రామం మధ్యలో హత్య ప్రకటన ప్రచురించబడడం ఈ భావనకు అద్దం పడుతుంది.

‘ది పేల్ హార్స్’ వంటి నవలల్లో ఆధునిక టెక్నాలజీ (విద్యుత్ యంత్రాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలు) నేరానికి ఉపకరణాలుగా మారడం చూస్తాం. ఇది నేటి సైబర్ నేరాలు, టెక్నాలజీ దుర్వినియోగంపై చేసే వ్యాఖ్యానాన్ని సమకాలీన విషయాల ప్రస్తావనగా మారుస్తుంది. అగాథా క్రిస్టీకి విమర్శకుల నుండి ఎదురైన ప్రధాన సవాల్ ఆమె పాత్ర చిత్రీకరణకు సంబంధించింది. ఎడ్మండ్ విల్సన్, పి.డి. జేమ్స్ వంటి రచయితలు ఆమె పాత్రలను ‘గట్టి కార్డ్‌బోర్డ్‌త్’తో చేసినట్లు, ఉపరితలంగా ఉంటాయని విమర్శించారు. అయినప్పటికీ, ఆమె ప్లాట్ల నిర్మాణంలోని అద్భుతమైన కౌశలం ఈ విమర్శలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే ఉంటుంది. సినిమా, టెలివిజన్ అనుసరణలు ఆమె వారసత్వాన్ని నిలబెట్టడం లో కీలక పాత్ర పోషించాయి. కెన్నెత్ బ్రానా నిర్మించిన ఆధునిక ‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’ (2017), ‘డెత్ ఆన్ ది నైల్’ (2022) సినిమాలు ఆ మె కథలను కొత్త తరానికి పరిచయం చేశాయి. అయినప్పటికీ, ఈ అనుసరణ లు కొన్నిసార్లు ఆమె అసలు రచనల్లోని సూక్ష్మ విమర్శలను, నేపథ్యాలను విస్మరించి, కేవలం దృశ్య వైభవానికే ప్రాధాన్యత ఇస్తాయనే విమర్శ కూడా ఉంది.

చివరిగా, అగాథా క్రిస్టీ కేవలం ఒక నేర కథా రచయిత్రి మాత్రమే కాదు; ఇరవయ్యవ శతాబ్ది మధ్యలో మారుతున్న పాశ్చాత్య సమాజ మానసిక స్థితిని, భయాలను, ఆశలను అత్యంత చాకచక్యంగా రికార్డ్ చేసిన ఒక చరిత్రకారిణి. ఆమె రచనలు ‘గోల్డెన్ ఏజ్’ నేర కథలకు నమూనాగా ఉం టూనే, వాటి స్వంత సంప్రదాయాలను తారుమారు చేస్తూ, ‘పోస్ట్ మాడర్న్’ సాహిత్యం యొక్క అంచనాలను ఊహించాయి. నేటికీ ఆమె పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా బుక్స్ ఎగ్జిబిషన్‌లలో, కొత్త అనువాదాల తో, కొత్త అనుసరణలతో ఆన్‌లైన్ లలో కూడా విక్రయించబడటం, ఆమె కథలు, ఆ కథనాల్లోని మూ లాధారమైన మానవ స్వభావం ఎంత సార్వత్రికమో చాటిచెప్పడానికి ఒక ఉదాహరణగా సరిపోతుంది. అగాథా క్రిస్టీ రచనలు ఇప్పటికీ ప్రపంచ డిటెక్టివ్ సాహిత్య అభిమానుల్ని, ఆకర్షిస్తున్నాయి. ఆమె తర్వాత నేర పరిశోధనలో కథలు రాసేవారు ఎంతో మంది వచ్చారు. కానీ ఆమె రచనలు చదివే వారిని ఇప్పటికీ ముగ్ధులను చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేరం ముగిసిన తర్వాత, శాంతి పునరుద్ధరించబడినా, ఆ శాంతి ఎంత నాజూకో, ఎంత అనిశ్చితమో ఆమె మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. డిటెక్టివ్ సాహిత్య రచయితలకు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిటెక్టివ్ సాహిత్యాన్ని ఒక తరం వారినే కాక నేటి తరాన్నికూడాఉర్రూతలూగిస్తూనే వుంది. ఇప్పటికీ అలాంటి రచనలకు పాఠకుల్లో క్రేజ్ తగ్గలేదు.


 - డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్