
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని పాలకొండ బైపాస్ క్రాసింగ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్పోర్ట్స్ రేస్ బైకర్ అతివేగంతో దూసుకొచ్చి కారును ఢీకొన్న సంఘటనలో బైకర్‌తో పాటు అతని స్నేహితుడు, కారులోని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసు ల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రేమనగర్‌కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు స్థానిక యూబీ గార్డెన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో స్థానిక పాలకొండ బైపాస్ వద్ద క్రాసింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది.
కారులో ఉన్న చిన్నారులు ఉజేఫా (7), అమర్ (2), అర్సియా బేగం (30)తో సహా స్పోర్ట్స్ బైకర్ యాకూబ్ అఫ్జల్ (25)తో పాటు అతని స్నేహితుడితో సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్పోర్ట్స్ బైకర్ దాదాపు 180 కిలోమీటర్లు అతివేగంతో వచ్చి కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద ఘటన స్థలం బీభత్సంగా మారింది. బైకర్ అతివేగ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 11 మంది స్పోర్ట్స్ బైకర్‌లు అతివేగంతో మహబూబ్‌నగర్‌కు బయల్దేరగా అందులో యాకూబ్ అఫ్జల్, అతని స్నేహితుడు అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టారు. సంఘటన జరిగిన వెంటనే మిగిలిన బైకర్లు అక్కడినుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.














