
భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంధన సంక్షోభం నెలకొంటున్న దశలో ఈ అరబ్ దేశానికి ప్రధాని మోడీ వెళ్లడం కీలక పరిణామం అయింది. కేవలం కొన్ని గంటల ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అబూధాబిలో యుఎఇ అధ్యక్షులు షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం అయ్యారు. ఇరువురు మధ్య చర్చల తరువాత పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇంధన, రక్షణ వంటి పలు కీలక రంగాల విషయంలో ఇరుదేశాల పరస్పర సహకారం ఇనుమడింపచేసుకోవడం కీలక పరిణామం అయింది పశ్చిమాసియాలో శాంతి స్థాదపనకు తమ సహకారం ఉంటుందని అరబ్ నేతతో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. నాలుగు యూరప్ దేశాలు సహా మొత్తం ఐదు దేశాల పర్యటనలో తొలి మజిలిగా ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చారు. వెంటనే ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. ఇటీవలి కాలంలో అరబ్ ఎమిరేట్స్‌లోని కీలక స్థావరాలపై జరిగినదాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగడం అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభానికి దారితీసింది.
ఇక్కడ దాడి గర్హనీయం , ఈ క్రమంలో ఇక్కడి నాయకత్వం ప్రదర్శించిన సంయమనంతో కూడిన ప్రతిఘటన ప్రశంసనీయం అని మోడీ తెలిపారు. గల్ఫ్ యుద్ధం అంతర్జాతీయంగా చూపుతున్న ప్రభావం ఆందోళనకరం అని మోడీ పేర్కొన్నారు. పరిష్కారం దిశలో ఎటువంటి చర్య తీసుకున్నా బారత్ నుంచి యుఎఇకి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఇరుదేశాల నేతల మధ్య చర్చల తరువాత కుదిరిన పలు ఒప్పందాలలో అత్యంత కీలకమైన ఒప్పందం ఇంధన సహకార విషయంపై కుదిరింది. భారతదేశపు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ అబూధాబికి చెందిన జాతీయ చమురు కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవడం, ప్రధాని మోడీ, యుఎఇ నేతల సమక్షంలో సంతకాలు జరగడం కీలక పరిణామం అయింది. వంటగ్యాసు సరఫరాకు సంబంధించి కూడా మరో ఒప్పందం ఖరారు అయింది. యుఎఇ పర్యటన తరువాత ప్రధాని మోడీ నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, తరువాత ఇటలీల పర్యటిస్తారు. పలు కీలక విషయాలపై నేతలతో చర్చలు జరుగుతాయి. భారతదేశానికి ఇప్పుడు చమురు, వంటగ్యాసు సరఫరాల పరిస్థితిలో సమస్య ఉన్నందున దీనిని అధిగమించే దిశలోనే ప్రధాని మోడీ అరబ్ ఎమిరేట్స్ అధినేతతో కీలక చర్చలకు దిగారని వెల్లడైంది.
ప్రధాని మోడీ విమానానికి అరుదైన గౌరవ భద్రత
ఎస్కార్టుగా సాగిన యుఎఇ యుద్ధ విమానం
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రత్యేక విమానంలో యుఎఇ పర్యటనకు బయలుదేరినప్పుడు ప్రత్యేక గౌరవ స్వాగతం దక్కింది. ఈ విమానం అరబ్ దేశ గగనతలంలోకి చేరగానే యుఎఇకి చెందిన ఫైటర్ జెట్ విమానం ఎస్కార్ట్‌గా సాగింది. ఈ దేశ వాయుసేన కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎఫ్ 16 బ్లాక్ 60 డెజర్ట్ ఫాల్నర్ ఫైటర్‌ను యుఎఇ పాలకులు పంపించారు. అబూధాబిలో ప్రధాని మోడీ విమానం దిగేవరకూ ఈ ఫైటర్ మిన్నంటి వెన్నంటి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నడుమ భారత నేతకు అత్యంత ప్రధానమైన స్వాగత భద్రతా ఏర్పాట్లు తీసుకునేందుకు ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఫైటర్ తరలించారు. ఫైటర్ ఎస్కార్ట్ స్వాగతం కోసం ముందుగా భారతీయ అధికారుల అనుమతి తీసుకున్నారు. విమానాశ్రమంలో ప్రధాని మోడీకి యుఎఇ నేత స్వయంగా వచ్చి సాదర స్వాగతం పలికారు. తనకు ఆయన నుంచి అందిన ప్రత్యేక స్వాగతం అందిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. అరబ్ ఎమిరేట్స్ సోదరుడికి ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.














