
రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. సర్వే నంబరు 42లో మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాలని కొంతమంది ప్రయత్నించారు. అక్కడ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గదిని కూడా నిర్మించారు. ఐదు ఎకరాల చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ కూడా నిర్మించే క్రమంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి తనదిగా చెబుతూ ఎవరినీ అటువైపు రానీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డులతో పాటు.. నిర్మించిన గదితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొలగించింది. మొత్తం ఆక్రమణలు తొలగించిన తర్వాత ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వరకూ ఉంటుందని అంచనా.












