గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. మంగళవారం, బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, పలు కాలనీలు చెరువులను తలపించాయి. వరద నీటి ప్రవాహంతో నాలాలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓపెన్ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక, గురువారం కూడా కంటిన్యూగా ముసురు పడుతూనే ఉంది.