అలస్కా సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. కెనై ద్వీపకల్పంలోని సెల్డోవియా ప్రాంతంలో బుధవారం ఓ చిన్న విమానం చిత్తడి నేలలో కూలిపోవడంతో నలుగురు మరణించారని అలస్కా స్టేట్ ట్రూపర్స్ తెలిపారు. పైపర్ పీఏ-24 విమానం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ విమానాశ్రయం నుండి  సెల్డోవియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సెల్డోవియా విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానం.. దాదాపు 13 నుండి 17 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది ట్రూపర్స్ తెలిపారు.

ప్రమాద స్థలంలో ఉన్న ప్రజలు విమానం వద్దకు చేరుకుని, లోపల ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించారని.. కానీ విమానం వద్దకు చేరుకోలేకపోయారని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అలస్కా రీజియన్ చీఫ్ క్లింట్ జాన్సన్ చెప్పారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే ట్రూపర్స్ ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. విమానం లోపల చిక్కుకుపోయిన నాలుగు మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అలస్కా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.