
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టయ్యాడు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డెరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. భారత్‌కు చెందిన మంజీత్ సింగ్ బేడీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 6 లక్షల డాలర్ల మేరకు నష్టం కలిగించాడని, అతనిపై 1.5 లక్షల డాలర్ల రివార్డు ఉందని పటేల్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ కమిషనరేట్ పరిధిలో అరెస్టయిన అతనిని అమెరికా తీసుకెళ్లేందుకు ఎఫ్‌బిఐ చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం, వాషింగ్టన్‌లోని టాకోమాలో బేడీ చిన్న కిరాణా దుకాణం నిర్వహించేవాడు. ప్రభుత్వ ఆహార సహాయ పథకం ‘స్నాప్’ లబ్ధిదారుల ఈబీటీ కార్డులను స్త్వ్రప్ చేసి ఆహార పదార్ధాలు ఇవ్వకుండా నగదు అందించేవాడు. వచ్చిన మొత్తంలో సగం తనవద్దే ఉంచుకునేవాడు. మార్చి 2024, జూన్ 2025 మధ్య ఈ మోసానికి పాల్పడ్డాడు. దీంతో ‘స్నాప్’ బెనిఫిట్ ఫ్రాడ్ కింద అరెస్టు చేయకుండా కోర్టుకు హాజరయ్యేందుకు ఆయనను అనుమతించారు.
కేసు విచారణ సందర్భంగా పాస్‌పోర్టును అప్పగించి వాషింగ్టన్ దాటి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కెనడాకు, అక్కడ్నించి భారత్‌కు పారిపోయినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది. యూఎస్ డిస్ట్రిక్ కోర్టు ఆయనపై మే 21న ఫెడరల్ అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. కాగా, ఎఫ్‌బీఐ కొత్తగా రూపొందించిన మోస్ట్ వాంటెండ్ మోసగాళ్ల జాబితాలో అరెస్టయిన ఐదో వ్యక్తి బేడీ అని కాష్ పటేల్ వివరించారు.








