
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఛే నంబర్ జంక్షన్ సమీపంలో ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్ (సర్వీస్ సెంటర్) లో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. మంటలు పక్కనే ఉన్న రెనాల్ట్ (Renault) షోరూమ్‌కు కూడా వ్యాపించాయి. ప్రమాద సమయంలో షోరూమ్‌లో కొత్త కార్లతో పాటు సర్వీసింగ్ కోసం వచ్చిన వాహనాలు, స్పేర్ పార్ట్స్ ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి
చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో, మంటలు అటువైపు వ్యాపించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా సమీప ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ పరికరాలు వేడెక్కడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.













