
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన బీజేపీ “ఇక భారత్ అంతా మోడీ మయం”అన్న నినాదాన్ని ప్రచారం చేస్తోంది. ఇప్పుడీ ప్రయాణంలో పశ్చిమబెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరిందని, మనమంతా 2047లోగా వికసిత్ భారత్‌ను నిర్మిద్దాం ” అని సూచిస్తోంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లకు ఈ ఎన్నికలు పరాజయం అందించడం సిట్టింగ్ సిఎంలపై ఓటర్లకు ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ పాగా వేయడం చారిత్రాత్మక మలుపు అని చెప్పవచ్చు. ఆ రాష్ట్రంలో వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఏభై ఏళ్లుగా పాలించాయి. ఇప్పుడు తొలిసారి అక్కడ కాషాయం జెండా ఎగరబోతోంది, ఇక్కడ ఎలాగైనా తన ఉనికిని నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంత ప్రయత్నించినా 2016,2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. 2016లో కేవలం మూడు సీట్లకే పరిమితం కాగా, 2021లో 77స్థానాలనే దక్కించుకుని మమత కంచుకోటను ఛేదించడం అంత సులువుకాదని ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుంది.
వ్యవస్థీకృత మార్పులను తీసుకు వచ్చింది. ప్రజల్లో మమతా బెనర్జీకి ఉన్న పాప్యులారిటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా వ్యక్తిగతంగా ఆమెను విమర్శించకుండా అధికార పార్టీ ఎమ్‌ఎల్‌ఎల్లోని అవినీతిని బట్టబయలు చేసింది. 220 నియోజకవర్గాల్లోని టిఎంసి ఎమ్‌ఎల్‌ఎలపై ఛార్జిషీట్లు విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దీంతో 77 మంది అభ్యర్థులను టిఎంసి మార్చుకోవలసి వచ్చిందంటే బీజేపీ ఏ విధంగా తన వ్యూహంతో ప్రజల్లో ప్రచారం చేసిందో చెప్పవచ్చు. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి. శాంతిభద్రతల వైఫల్యం, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల సమస్య, ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం మమత పాప్యులారిటీని మసకబారించాయి. ఓటర్ల జాబితాల్లో దాదాపు 60 లక్షల మంది పేర్లను తొలగించడంపై ఎంత పోరాటం చేసినా కలిసి రాలేదు. ఈసారి మమత వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్న విశ్లేషణ ఓటర్లలో కనిపించింది. రాష్ట్రంలో 70 శాతం ఉన్న హిందూ ఓటర్లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. చారిత్రాత్మకంగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి సర్వశక్తులూ ధారపోసిన మమతా బెనర్జీ కలలు నెరవేరలేదు .
ఇక కేరళ విషయానికి వస్తే 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ప్రపంచం లోనే మొదటిసారి కేరళంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు కుప్పకూలడం చెప్పుకోదగిన పరిణామం. 1957 నుంచి కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర ఇలా 49 ఏళ్లలో ఏదో ఒక చోట వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతూ వస్తోంది. ఇప్పుడు అసలు కమ్యూనిస్టు ప్రభుత్వమే దేశంలో చిరునామా లేకుండా మాయమై పోయిందనిపిస్తోంది. కేరళ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఎల్‌డిఎఫ్ కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని 2021లో బద్దలు కొట్టి రెండోసారి అధికారం లోకి వచ్చింది. లైఫ్ మిషన్ వంటి పథకాలు అమలు చేసినా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర సమస్యగా తయారైంది. పెన్షన్ల పంపిణీలో జాప్యం వంటివి విపక్షాల విమర్శలకు ఆజ్యం పోశాయి. అనుభవజ్ఞులైన , కీలకమైన నేతలు ఐదుగురు పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ మద్దతు గల యుడిఎఫ్ ఇండిపెండెంట్లుగా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగం లోకి దిగడం ఎల్‌డిఎఫ్‌కు తీరని దెబ్బ. 2021 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత యుడిఎఫ్ కొత్త వారికి , యువకులకు అభ్యర్థులుగా రంగం లోకి దింపింది.
ఇప్పుడు యుడిఎఫ్ విజయం సాధించడంతో తెలంగాణలో విజయవంతమైన హామీల నమూనాను కేరళలో అమలు చేయించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంటోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అనూహ్యమైన మలుపు. కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీఎం ఈసారి తనస్తానాన్ని దక్కించుకోలేకపోయారు. 1996తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకలా ఉన్న డీఎంకే, ఏఐఎడిఎంకే అనే రెండు కూటముల ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని విజయ్ టీవీకే పార్టీ బద్దలు చేసింది. ద్రవిడ దిగ్గజ పార్టీలైనప్పటికీ ఓటర్లలో అసంతృప్తి, విజయ్ స్టార్ ఇమేజీ అనూహ్యమైన ఫలితాలు అందించాయి. తమిళనాడు రాజకీయాల్లోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికలు తెలియజేశాయి.
ఇక ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి 118 సీట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం 108 సీట్లలో గెలుపు కనిపిస్తోంది. మెజార్టీ తగ్గిన పక్షంలో ఏ పార్టీతో విజయ్ పొత్తులు పెట్టుకుంటారో అప్పుడే చెప్పలేం. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు విపక్ష కూటమి “ఇండియా”కు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవు. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత కొద్ది కాలం పాటు ఇండియా కూటమి పుంజుకున్నప్పటికీ తరువాత మొక్కుబడి తంతుగా తయారైంది. ఇండియా కూటమి అంత బలమైనది కాదని, ఒక తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని ఎన్‌డిఎ విమర్శిస్తోంది. బీజేపీ హవా ముందు ఏ పార్టీ నిలబడలేని పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్ టైగర్‌మమతా బెనర్జీ, హిందీని వ్యతిరేకిస్తూ ద్రవిడ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకు వచ్చిన ఎంకె స్టాలిన్ ఓటమి చెందడం రానున్న 2029 లోక్‌సభ ఎన్నికలు విపక్ష కూటమికి అగ్నిపరీక్షకానున్నాయి.














