మనతెలంగాణ / సిటిబ్యూరోః అంతరాష్ట్ర గంజాయి ముఠాను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 22.22కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని షాహీన్‌నగర్, అమీనా మసీద్ ప్రాంతానికి చెందిన మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాం ( 35), బార్కస్, కొత్తపేటకు చెందిన అవాద్ బిన్ అలీ యాఫై అలియాస్ అవాద్, కిషన్‌బాగ్‌కు చెందిన సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ధిల్లాన్ కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాంపై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడు. సద్దాం గతంలో హత్యలు, హత్యాయత్నాలతో సహా 22 కేసులు ఉన్నాయి. అవాద్ బిన్ అలీ యాఫైపై 10 దొంగతనాల కేసులు, సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ పై రెండు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

నిందితులకు పాత నేరస్థుడైన ఇబ్రహీం బామర్‌తో పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఇక్కడ వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్‌కు వెళ్లి జన్నీ అలియాస్ సన్నీ అనే వ్యక్తి వద్ద నుండి కిలోకు రూ. 5వేల- చొప్పున 22 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసి, మూడు బ్యాగులలో తీసుకుని బయలు దేరారు. ఖమ్మం వరకు రైలులో వచ్చిన నిందితులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మీర్జా జాఫర్ బైగ్, అవాద్, మన్‌ప్రీత్ సింగ్ రైలు దిగి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఇబ్రహీం బామర్ మాత్రం రైలులో హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్‌కు చేరిన తర్వాత, గంజాయిని కొనుగోలుదారునికి అందజేయాలని ఇబ్రహీం బామర్ చెప్పాడు. ఈ మేరకు ముగ్గురు నిందితులు మంగళవారం సాయంత్రం సాదత్ నగర్ బస్ స్టాప్ వద్ద గంజాయి బ్యాగులతో కొనుగోలుదారుని కోసం వేచి చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీం బిన్ సలీమ్ బామర్ అలియాస్ ఇబ్రహీం బామర్, గంజాయి సరఫరాదారుడు జన్నీ అలియాస్ సన్నీ (ఒడిశా) పరారీలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదాబాబు , సబ్ ఇన్ స్పెక్టర్లు ఎం. మధు, ఎం. మహేష్, కె. రామారావు, పిసి ఎస్. బాల్ చందర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.