
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఈ సినిమాని కూడా అంతే విభిన్నంగా ప్రమోట్ చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాశ్, గేయ రచయిత అనంత శ్రీ రామ్‌ని ఇసుకలో పాతిపెట్టి తనకు ఎలాంటి పాటలు కావాలో వాళ్ల చెప్పే వీడియో నవ్వులు పూయించింది.
ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని చెప్పేందుకు కూడా అనిల్ ఓ వెరైటీ వీడియోతో మన ముందుకు వచ్చాడు. హీరో, హీరోయిన్లు, జివి ప్రకాశ్ మాట్లాడుతూ ఉండగా.. చేతిలో పెద్ద కత్తి పట్టుకొని.. తల పాగ పెట్టుకొని అనిల్ అక్కడకు వస్తాడు. తనకు ‘కాన్సెప్ట్ కింగ్’ అనే బిరుదు ఇచ్చారని చెబుతాడు. ఇంతలో వెంకటేశ్ నేను ఓ ఐడియా ఇస్తానని కత్తి తీసుకొని అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తారు. అనంతరం వీర తిలకం అమ్మాయిలు దిద్దాలిగా అంటూ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టిలు అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం పెడతారు. ఆ తర్వాత అనిల్ ‘ఎంత రాయలసీయ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం ఇంత రక్తపాతం అవసరమా’ అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. చివర్లో సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. సినిమా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని తెలిపారు.









