
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలు అందించే అత్యవసర సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు లు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగం గా వన్ నేషన్ వన్ నెంబర్ ‘112’ను బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర డిజిపి సి.వి.ఆనంద్ అధికారికంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఇప్పటి వరకు ‘పోలీస్ కోసం 100, అగ్నిమాపక శాఖకు 101, వైద్య సేవలకు 108, ఇలా ఇప్పటి వరకు వేరు వేరుగా నెంబర్‌లు వినియోగించే వారు’, దీంతో పౌర సేవలు అందించేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. కేంద్ర ప్రభు త్వ తీసుకొచ్చిన వన్ నేషన్ వన్ నెంబర్‌లో భా గంగా ఇకపై రాష్ట్రంలోని అత్యసవసర సేవలన్నీ ఒకే గొడుగు కింద 112 ద్వారా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 112కు బాధితులు ఫోన్ చేస్తే వారి పరిష్కారానికి సిబ్బంది మానిటరింగ్ చేస్తారని చెప్పారు. రాష్ట్ర అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని, 2003లో ఈ--కాప్, ప్రారంభించారని, సిసి కెమెరాలు అంటే తెలియని రోజుల్లోనే వాటిని వినియోగించినట్లు గుర్తు చేశారు. 2013లో నిర్భయ ఘటన తరువాత కేంద్ర అన్ని సేవలకు ఒకే నెంబర్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
అత్యవసర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు 112 సేవలకు, ఏఐ ఆధారిత కాల్ సిస్టమ్‌తో రెస్పాన్స్ టైం గణనీయంగా తగ్గిందన్నారు. అధికారులు 112కు వచ్చిన ఫిర్యాదును ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం చేయకూడదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల్ ఫిల్టరింగ్ అనే సాంకేతికతను కొత్తగా అందుబాటులోకి తీసుకోచ్చామని, ప్రతి రోజు 112 కు వచ్చే సుమారు 14 లక్షల కాల్స్‌ను వడపోసి, వాటిలో నిజమైన 7500 కాల్స్‌ను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత సాంకేతికతతో ఆపదలో ఉన్న వారి లోకేషన్ 60 శాతం మాత్రమే ఖచ్చిత్తత్వం ఉండేదని, నేడు 95 శాతం ఖచ్చితత్వంతో బాదితుల లోకేషన్ తెలిపే విధంగా సాంకేతిను అందుబాటులోకి తీసుకుచ్చామని, దీంతో సిబ్బంది త్వరగా స్పందించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఒకే సారి 960 కాల్స్ స్వీకరించే విధంగా సాంకేతిక ఉందని, దీంతో అత్యవసర సమయాల్లో మరో 360 కాల్స్ కూడా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
కాల్ ప్రాసెసింగ్‌లో 30శాతం మెరుగుదల
నూతన వ్యవస్థ అమల్లోకి రావడంతో అత్యవసర కాల్స్ నిర్వహణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు డిజిపి తెలిపారు. కాల్ స్పందన సమయం 100 సెకన్ల నుంచి 69 సెకన్లకు, డిస్పాచర్ సమయం 90 సెకన్ల నుంచి 64 సెకన్లకు మొత్తం కాల్ ప్రాసెసింగ్ సమయం 190 సెకన్ల నుంచి 133 సెకన్లకు తగ్గిందన్నారు. దీంతో దాదాపు 30 శాతం వేగం పెరిగిందని, అత్యవసర పరిస్థితుల్లో ఆదా అయ్యే ప్రతి సెకను ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. దేశ సగటు కంటే ప్రస్తుతం తెలంగాణలో అత్యవసర స్పందన సమయం పట్టణాల్లో ఆరు నిమిషాలు,
గ్రామీణ ప్రాంతాల్లో- 15 నిమిషాలు ఉండగా, రాష్ట్ర సగటు పది నిమిషాల 30 సెకన్లుగా ఉందని తెలిపారు. దేశ సగటు స్పందన సమయం 18 నిమిషాలు ఉండగా, తెలంగాణ దానికంటే ఎంతో మెరుగైన పనితీరుతో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందని వివరించారు. రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్లలో 1,860 పెట్రోలింగ్ వాహనాలను (788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు) డిజిటల్‌గా ఈ వ్యవస్థతో అనుసంధానించారని, అత్యవసర కాల్ వచ్చిన వెంటనే సమీపంలోని వాహనాన్ని గుర్తించి అక్కడికి పంపే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని డిజిపి చెప్పారు.
112 కాల్‌తో మొత్తం 18 రకాల సేవలు
112కు సంబంధించి విజయవంతంగా పరీక్షలన్నీ పూర్తి చేసి ప్రారంభించామని, పోలీస్, మెడికల్, ఫైర్, ఉమెన్ సమస్యలు, హైడ్రా కోసం 112 లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. చైల్డ్ హెల్ప్‌లైన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్‌ఎంసి లాంటి 18 సేవలు 112కు డయల్ చేస్తే ఫాల్ అప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు ఎన్‌ఆర్‌ఐ డెస్క్ కూడా అందుబాటులోకి తెచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. దేశంలోనే తొలిసారి ఏఐ, మానవ వనరుల ఆధారిత 112 సేవలు రాష్ట్రం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. డయల్ 100ను 2013లో కొంపల్లిలో జీవీకే వారి సాయంతో ప్రారంభించారని, వివిధ అత్యవసరాలకు ఒకే నంబర్ ఉండాలని గతంలో కేంద్రం సూచించిందని, దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంకేతికత అభివృద్ధి చేస్తూ రావడంతో ఏఐ వచ్చాక అనేక పనులు సులువుగా మారాయని డిజిపి పేర్కొన్నారు. న్యాయ, వైద్య, సైబర్ సాయం అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం అయిందని,
అలాగే డయల్ 112 కాల్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ టూల్స్ వాడుతున్నట్లు తెలిపారు. డ్రోన్ బెస్డ్ టెక్నికల్ సిస్టాన్ని త్వరలోనే ఉపయోగించనున్నామని, అలాగే డ్రోన్ బృందాన్ని సైతం సిద్దం చేయనున్నట్లు చెప్పారు. బేసిక్ పోలీసింగ్ లాగా టెక్నాలజీ పోలీసింగ్‌ను తీసుకువస్తున్నామని, డయల్ 112 అనేది 3.0 వెర్షన్‌గా ఉంటుందని, ఇందులో యువ ఐపిఎస్‌లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు డిజిపి తెలిపారు. గతంలో మావోయిజం, డెకాయిట్, రాబరీ లాంటి అనేక సమస్యలు పోలీస్ శాఖ పరిష్కరించిందని, నేటి సమాజంలో నార్కోటిక్స్, సైబర్, ఆహార పదార్ధాల కల్తీ లాంటి వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని, వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సిఐడి చీఫ్ చారు సిన్హా, డిజిలు విక్రమ్ సింగ్ మాన్, శ్రీనివాస్, కమల్ హాసన్ రెడ్డి, సిపిలు రమేష్ రెడ్డి, సుమతి, సజ్జనార్, జాయింట్ సిపి గజరావ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.








