
హైదరాబాద్: విద్యా వ్యవస్థలో పారదర్శకత వచ్చేవరకు తాము పోరాటం చేస్తామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇది ముగింపు కాదు అని కేవలం ప్రారంభమేనని, ఇంకా చాలా పెద్ద ప్రయాణం ఉందని ప్రభుత్వాలకు హెచ్చరకలు పంపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో 37 రోజుల నుంచి జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, మేధావులు, సిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా తన ఎక్స్‌లో అభిజీత్ దీప్కే వీడియోను విడుదల చేశారు. దేశం కోసం మీరు చేసి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు. మీ అందరి మద్దతుతోనే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యిందని ప్రశంసించారు. తమను విమర్శించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని, విమర్శకుల వల్లే తాము ఇంకా మెరుగ్గా పని చేశామని పేర్కొన్నారు. గత 37 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా ధర్నాలు చేస్తున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉండేదని, గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.











