
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్ర శ్నిస్తూ బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు నాటకాలు ఆడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కి చంపేందుకు దాడులకు పా ల్పడుతున్న ఘటనలపై ఎందుకు మౌనం వ హిస్తున్నారని నిలదీశారు. ఈ మేరకు రా హుల్ గాంధీని కెటిఆర్ ఎక్స్‌లో ప్రశ్నించా రు.
విద్యార్థులపై పోలీసుల దమనకాండ ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని అన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నా, వారిని ఈడ్చుకెళ్తున్నా, వారి హక్కులను అణచివేస్తున్నా రాహుల్ గాంధీ స్పందించకపోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. ఇక్కడ విద్యార్థులను చావగొడుతున్న పోలీస్ లాఠీలపై కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉన్నందుకే, రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు.'
విద్యార్థుల పట్ల ద్వందనీతి సరైనది కాదు
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయాలని కెటిఆర్ అన్నారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడతారా.. లేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు రాజకీయ రక్షణ కల్పిస్తారా..? అని రాహుల్ గాంధీని కెటిఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని..అంతేకానీ, విద్యార్థుల పట్ల ద్వందనీతి సరైనది కాదు అని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యార్థులపై జరుగుతున్న దాష్టీకంపై స్పందించకుంటే విద్యార్థులపై రాహుల్‌గాంధీ కపట ప్రేమ మాత్రమే అని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై రాహుల్ గాంధీ స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం.. అదే హక్కులు తెలంగాణ విద్యార్థులకు కూడా ఉన్నాయని గుర్తించాలని అన్నారు.











