మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల వ్యవస్థను పరిరక్షించేందుకు సివిల్ సప్లైస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా బకాయిలు పెట్టిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు గ్రేహౌం డ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది అత్యుత్తమ కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ ఎన్ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగంలో నియమించింది. కొత్తగా విదుల్లో చేరిన కమాండోలతో సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు అక్రమాలు, నిబంధనల ఉ ల్లంఘనలను అరికట్టేలా

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృం దాలుగా వీరు పనిచేయనున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ వ్యవహారాలు పోలీసులకు కొత్త కావడంతో ఇప్పటికే మూడు రోజులపాటు ప్రత్యే క శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై పోలీస్ అకాడమీలో వారికి అవగాహన కల్పించిన ట్లు పేర్కొన్నారు. గత సీజన్ కెఎంఎస్2025, -26 లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించిన విషయాన్ని కమిషనర్ గుర్తుచేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. భా రీ స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన నేపథ్యంలో మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఆకస్మిక తనిఖీలు..

ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి తనిఖీల్లో కమాండోలకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని సివిల్ సప్లైస్ శాఖ వినియోగించుకోనుందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా పనిచేసే 28 మంది కమాండోలు, ప్రభుత్వానికి బియ్యం బకాయి ఉన్న మిల్లర్లపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినా, పౌరసరఫరాల శాఖ నిబంధనలను ఉల్లంఘించినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెందాల్సిన బియ్యం సకాలంలో అందేలా, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిధులకు రక్షణ కల్పించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు.