
గువహతి: అస్సాంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వరదల కారణంగా మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 3 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీనివల్ల ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అస్సాం జిల్లాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉండటలంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని.. లోతపట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.
అస్సాంలోని ఏడు జిల్లాలు.. శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామరూప్ (మెట్రోపాలిటన్)లో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలు ఇంకా వరద ఉధృతిని ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. వరదల కారణంగా నిరాశ్రయులైన సుమారు 16,500 మందికి పైగా ప్రజలను 71 సహాయక శిబిరాలకు తరలించారు.











