2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న రాహుల్ గాంధీకి ఇప్పటికీ పరిణతి గాని, సంయమనం గాని లేకపోవటం దయనీయమైనది. ఆ వంశ వారసత్వానికే అవమానకరం. దేశ ప్రయోజనాలు అమెరికన్ వ్యూహాలకు, ధనిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా మారటం మన్నది కాంగ్రెస్ హయాంలోనే మొదలై ఇపుడు కూడా కొనసాగుతున్నదని రాహుల్‌కు తెలియదా? ఆయన అదానీ, అంబానీలను ప్రస్తావించారు. ఇందులో అదానీ పేరు మోడీ కాలానికి సంబం ధించినది. కాని మొదటి నుంచి టాటా, బిర్లాలు అనే మాట, తర్వాత అంబానీ మాట, కాంగ్రెస్ ఆర్థిక విధానాలకు పర్యాయ పదాలుగా మారటం ఆయన దృష్టికి రాలేదా? 1990 ల నుంచి తామే ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సృష్టించిన విప రీతమైన సామాజిక తారతమ్యాల గురించి తను వినలేదా? ఇవి అన్నీ ఒక స్థాయిలో అమెరికా శిబిరపు పెట్టుబడిదారీ ప్రయోజనాలతో ఎట్లా ముడిబడిపోయాయో, ఈ విషయంలో తమకు, బిజెపికి మధ్య ఏమాత్రం తేడా ఎట్లా లేదో చూసే అధ్యయనాలను ఆయన చూడలేదా?

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలపై చేసిన ఘాటైన విమర్శలనూ, అందుకు జవాబుగా బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీ కాంగ్రెస్ నాయకునిపై చేసిన ఎదురు దాడినీ గమనించినపుడు, ఆ రెండు పార్టీలలో ఈ దేశానికి ఏది సరైనదా అనే ప్రశ్న అంతే తీవ్రంగా ఎదురవుతున్నది. కొంత కాలంగా ప్రపంచం, అందులో భాగంగా భారతదేశం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వివిధ వర్గాల ప్రజలకు ఎవరి సమస్యలు వారికుండగా, వాటి నుంచి ఎట్లా గట్టెక్కాలో బోధపకుండా ఉండగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దుర్మార్గపు యుద్ధ ప్రభావాలు మూలిగే నక్కపై తాటిపండువలే వచ్చిపడుతున్నాయి. ఇటువంటి క్లిష్ట స్థితిలో దేశ ప్రజలు ఆశించేది, రాజకీయ నాయకత్వాలన్నీ కలిసికట్టుగా ఆలోచించి ఈ సమస్యలనుంచి తమను ఏ మేరకు కాపాడగలరో ప్రణాళికలు తయారు చేయాలని. ప్రజలను కూడా వెంట వేసుకుంటూ వాటిని వీలైనంత అమలు చేయాలని. ఆ విధంగా ప్రజలకు విశ్వాసం కల్పించాలని. భారతదేశపు అంతర్గత సమస్యలు ఎట్లున్నా కనీసం ఇరాన్ యుద్ధం వంటి బయటి పరిణామాల వల్ల ముంచుకొచ్చే వాటిని వీలైనంత ఎదుర్కొనేటట్లు దేశంతో పాటు ప్రజలు కూడా సిద్ధమయేందుకు అది ఉపయోగపడుతుంది.

కాని అట్లా జరుగుతున్నదా? నాలుగేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో చమురు, ఎరువుల వంటి వాటికి తలెత్తిన ఇక్కట్లు కొనసాగుతుండగానే ఇపుడు ఇరాన్ యుద్ధం వచ్చిపడింది. అందువల్ల సమస్య మరెంత తీవ్రమైందో అందరికీ కనిపిస్తున్నదే గనుక ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. రెండు యుద్ధాలూ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. సరికదా, అమెరికా, ఇజ్రాయెల్‌లు బెదిరిస్తున్నట్లు ఇరాన్‌పై తిరిగి దాడులు మొదలయే పక్షంలో ఇరాన్ ఎదురుదాడులు చేయగలదన్నది అట్లుంచి, ఇప్పటికే మూతపడిన హర్మూజ్ జలసంధికి అదనంగా తాము బాబ్ అల్ మందేల్ జలసంధిని సైతం మూసివేయగలమని హూతీలు హెచ్చరిస్తున్నారు. అది జరిగితే, ఇప్పటికే ఆగిన 20 శాతం రవాణాలు గాక మరో 15 శాతం నిలిచిపోతాయని అంచనా. అదే జరిగితే ఏమయేదీ చెప్పనక్కరలేదు. విషయమేమంటే, ఈ పరిస్థితుల కారణంగా ఇన్నిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నపుడు మన పార్టీలు, నాయకత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏది చేయాలో అది చేస్తున్నాయా? లేక ఎప్పటివలెనే చిల్లర రాజకీయాలు సాగిస్తున్నాయా?

ఈ నెల 20వ తేదీకి ముందు రోజులలోనూ వీరి ధోరణి ఇదే కాగా, ఆ రోజున ఎవరిని ఎవరు ఏమనుకున్నారో ఒకసారి చూద్దాము. మొదట రాహుల్ గాంధీ అన్నది ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరూ దేశ ద్రోహులు దేశ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా ప్రజల బాధలను పట్టించుకోవటం లేదు. ఆర్థిక తుఫాన్ ముందుకొస్తున్నది. ఎన్నడూ చూడనంతటి ద్రవోల్బణం మూడు నాలుగు నెలల్లో రానున్నది. వట్టి నినాదాల వల్ల ఉపయోగం లేదు. ఆర్థిక వ్యవస్థను అమెరికాకు, అదానీ, అంబానీలకు అప్పగించారు. ప్రధాని విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజలను మాత్రం వెళ్లవద్దని, బంగారం కొనవద్దని చెప్తున్నారు. ఇవీ కాంగ్రెస్ నాయకుని విమర్శలు.

దీనిపై బిజెపి విమర్శలను చూద్దాముః రాహుల్ మాటలు దేశాన్ని అవమానిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులను దేశ ద్రోహులంటున్నారాయన. పాకిస్థాని భాష మాట్లాడుతున్నారు. అనువంశిక రాజకీయాలకు ప్రతినిధివలే వ్యవహరిస్తున్నారు. అర్బన్ నక్సల్‌వలే మాట్లాడుతున్నారు. అరాచక ధోరణి చూపుతున్నారు. దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇరువురి మాటలను యథాతథంగా చెప్పుకున్న తర్వాత ఒకసారి వాటిని ఈ దేశ ప్రజల దృష్టితో పరిశీలించి చూడండి. వారిలో ఎవరి ధోరణి అయినా బాధ్యతాయుతంగా ఉందా? ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారాన్ని వెతుకుతున్నట్లుగాని, ప్రజలకు విశ్వాసం కల్పించగల విధంగా కాని ఉన్నదా? వారం రోజుల క్రితం ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ అనే ఊహాత్మక సంస్థ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

దానికి కొన్ని గంటలలోనే లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చినట్లు వార్తలు చెప్తున్నాయ. ఈ అనూహ్య స్థితి ఎందుకు పుట్టుకు వచ్చినట్టు? అది చెప్తున్న దేమిటి? 2025వ సంవత్సరం పొడుగునా, పలు దేశాలలో, జెన్‌జీ పేరిట ఇటువంటి ధోరణులు ఉప్పెనవలే లేచింది. ఇటువంటి పరిస్థితులలో, అసంతృప్తులలోనే, నేల అడుగున లావావలే మసలుతున్న నిరసనలకు ఒక చిహ్నం వంటిదే “కాక్‌రోచ్’ పార్టీ. దానికి, ఇరాన్ యుద్ధానికి, అమెరికా ఇజ్రాయెల్‌లకు, మోడీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, ఈ ‘విదూషక’ పార్టీకి మధ్య ప్రత్యక్ష సంబంధమేమీ లేదు. లేక, ఉన్నట్లు కనిపించదు. కాని, గొప్ప నాటక రచయితలు సృష్టించే విదూషక పాత్రలు, ఆ నాటక సారాంశాన్నంతా వ్యంగ్యంగా అభినయించి చూపుతాయి. నేల అడుగున జరిగే రసాయనిక ప్రక్రియలు వేర్వేరు అయినా పరస్పర్ప సంబంధం ఉంటుంది. ఎపుడో వాటి మధ్య సమీకరణాలు జరిగి పైకి ఉప్పొంగుతాయి.

అందువల్ల, ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యతలు మరిచి జోకర్లవలే విమర్శలు చేసుకుంటున్న మన నాయకమ్మన్యులు, ఏ విదూషక పార్టీయో, జెన్ జీయో లేక మరొకటో తమ పుట్టిన ముంచెత్తక ముందే కళ్లు తెరవటం మంచిది. తమ విదూషకత్వాన్ని క్లిష్ట పరిస్థితుల గడిచేవరకు వాయిదా వేయటం మంచిది. అదట్లుంచి, ఇరువురి పరస్పర విమర్శలు ఎంత హాస్యాస్పదంగా, హీనంగా ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాము. ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనను, ప్రధానిని, హోంమంత్రిని విమర్శించదగినవి ఇతరత్రా అనేకం ఉన్నాయి. కాని వారిని రాహుల్‌గాంధీ దేశద్రోహులనటం (ఆయన హిందీలో వాడిన మాట ‘గద్దార్’) తనకు పరిణతి లేని తనాన్ని, ఉక్రోషాన్ని చూపుతున్నది. ఒక గొప్ప రాజకీయ కుటుంబానికి చెంది, 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న ఆయనకు ఇప్పటికీ పరిణతి గాని, సంయమనం గాని లేకపోవటం దయనీయమైనది.

ఆ వంశ వారసత్వానికే అవమానకరం. దేశ ప్రయోజనాలు అమెరికన్ వ్యూహాలకు, ధనిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా మారటం మన్నది కాంగ్రెస్ హయాంలోనే మొదలై ఇపుడు కూడా కొనసాగుతున్నదని రాహుల్‌కు తెలియదా? ఆయన అదానీ, అంబానీలను ప్రస్తావించారు. ఇందులో అదానీ పేరు మోడీ కాలానికి సంబంధించినది. కాని మొదటి నుంచి టాటా, బిర్లాలు అనే మాట, తర్వాత అంబానీ మాట, కాంగ్రెస్ ఆర్థిక విధానాలకు పర్యాయ పదాలుగా మారటం ఆయన దృష్టికి రాలేదా? 1990 ల నుంచి తామే ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సృష్టించిన విపరీతమైన సామాజిక తారతమ్యాల గురించి తను వినలేదా? ఇవి అన్నీ ఒక స్థాయిలో అమెరికా శిబిరపు పెట్టుబడిదారీ ప్రయోజనాలతో ఎట్లా ముడిబడిపోయాయో, ఈ విషయంలో తమకు, బిజెపికి మధ్య ఏమాత్రం తేడా ఎట్లా లేదో చూసే అధ్యయనాలను ఆయన చూడలేదా? ప్రస్తుతానికి వస్తే ఇరాన్ యుద్ధం పట్ల, అమెరికా ఇజ్రాయెల్‌ల పట్ల కాంగ్రెస్ విధానమేమిటో మనకు తెలియకుండా ఉంది.

పోతే, ప్రభుత్వాన్ని విమర్శించటం బాగున్నది గాని, కాంగ్రెస్ వైపు నుంచి సూచించే ప్రత్యామ్నాయాలు ఏమిటో మాత్రం ప్రజలకు రాహుల్ నోటి వెంట విన రాలేదు. ఆయన తన ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు ఏమిటో ఇదమిత్థంగా ఎన్నడూ వివరించి చెప్పలేదు. ‘ఇండియా’ కూటమి వైఫల్యాలకు, విచ్ఛిన్నానికి అదొక ముఖ్య కారణం. బిజెపి ఎదురు విమర్శల తీరును చూసినపుడు, అయ్యో దేశమా అని దుఃఖించటం తప్ప మరొకటి కన్పించటం లేదు. ప్రభుత్వ నేతలను విమర్శిస్తే అది దేశానికే అవమానం. దేశ ప్రజలకే అవమానం. అది పాకిస్థాన్ భాష. అర్బన్ నక్సల్ భాష. అరాచక ధోరణి. అందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేశాన్ని 12 సంవత్సరాలుగా పాలిస్తున్న పార్టీలో ఇంతకన్న పరిణతితో ఆలోచించగలవారు, మాట్లాడగల వారులేనే లేరా? ఈ విధమైన పోటా పోటీ చవకబారు భాషకు, విధానపర వైఫల్యాలకు ఔను, వీళ్లిద్దరూ బోనెక్కాలి. ఇద్దరూ తమ వైఫల్యాలను అంగీకరించాలి. ఇద్దరూ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలి. లేనట్లయితే ‘కాక్‌రోచ్’ పార్టీ బొద్దింకలు పుట్ట పగిలినట్లు విరుచుకుపడగలవు.  

- టంకశాల అశోక్ (దూరదృష్టి)

(రచయిత సీనియర్ సంపాదకులు)