
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగాన్ని అందులో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌నకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్నిరకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు.
ఈ కేసు విచారణ నివేదికతో పాటు ట్రస్టునకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అందులోని సభ్యులందరినీ ప్రభుత్వమే నియమించిందని రాహుల్, ఖర్గే ప్రస్తావించారు. ట్రస్టు సభ్యులంతా ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని తెలిపారు. ఈ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రెటరీ మీకు అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని రాహుల్, ఖర్గే ప్రశ్నించారు.











