ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గుజరాత్‌లోని ఆహ్మదాబాద్ శివారు రామోల్-గట్రాడ్ రోడ్డులోని కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను దగ్గరల్లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వస్త్రాల్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ శిబిరం వెనుకే బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం విన్న వెంటనే శిబిరంలోని సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక బృందాలు రాకముందే సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.

అనంతరం ఘటనాస్థలికి ఐదు అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు బాణసంచా కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. పేలుడు ధాటికి శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని వారు వెల్లడించారు. బాణసంచా కర్మాగారంలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.