
లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం విద్యార్థులు, జనరేషన్ జెడ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార పక్షం , ప్రతిపక్ష శిబిరాలు చేస్తున్న రాజకీయ కుట్రలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువత తమ సమస్యలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో బీఎస్పీ ఎప్పుడూ తీవ్రంగా, సున్నితంగా వ్యవహరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇటీవల ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ప్రారంభించగా, తరువాత దాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హైజాక్ చేశాయని మాయావతి ఆరోపించారు. అదే విధంగా రాంచీలో కూడా విద్యార్థులు, యువత తమ సమస్యలపై నిరసన చేపట్టగా, తరువాత ఆ ఉద్యమాన్ని బీజేపీ, దాని మిత్ర పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన ఉద్యమం లోను, ఇప్పుడు రాంచీలో జరుగుతున్న ఉద్యమం లోనూ యువత అసలు సమస్యల కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.











