నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మంగా భావిస్తున్న అవశేషాలను టోక్యోలోని రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని కోరుతూ ఆయన కుమార్తె అనితా బి. ఫాఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తన తండ్రి భౌతిక అవశేషాలను గౌరవప్రదంగా, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భారత్‌కు తీసుకురావాలని అనితా ఫాఫ్ చాలాకాలంగా బహిరంగంగానే కోరుతున్నారని తెలిపారు.


1945 ఆగస్టులో నేతాజీ అదృశ్యమైన నాటి నుంచి ఆయనకు ఏమైందన్న అంశంపై అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. విమాన ప్రమాదంలో ఆయన మరణించారని, ఆయన అవశేషాలు టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలోనూ నేతాజీ మనవడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో నేతాజీ భౌతిక అవశేషాలుగా భావిస్తున్న చితాభస్మాన్ని భారత్‌కు తీసుకురావాలని ఆ పిటిషన్‌లో కోరారు. అయితే ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేయడంతో పిటిషనర్ ఆశిష్ రే తరఫు న్యాయవాది దాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. ధర్మాసనం అందుకు అనుమతించింది.

ఆమె (నేతాజీ కుమార్తె) మన ముందుకు రాలేదు అని అప్పట్లో ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన వారసురాలు చితాభస్మాన్ని భారత్‌కు తీసుకురావాలని కోరుకుంటే, ఆమె స్వయంగా కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఆమె భావాలను మేము గౌరవిస్తున్నాం. ఆ భావాలకు చట్టపరమైన రూపం కల్పించేలా మేము చర్యలు తీసుకుంటాం. అయితే ఆమె స్వయంగా ముందుకు రావాలి అని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు నేతాజీ కుమార్తె స్వయంగా పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశంపై కేంద్రం స్పందన కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.