తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న విదేశీ పర్యటనకు బయలుదేరనున్న సీఎం.. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 10న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అమెరికా, లండన్, జర్మనీ, చైనా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావుతోపాటు కొద్దిమందితో కూడిన బృందం మాత్రమే వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈసారి పెట్టుబడుల ఆకర్షణతోపాటు తెలంగాణలో ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల ఆఫ్‌లైన్ క్యాంపస్‌ల ఏర్పాటు, లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్ వంటి అంశాలపై సీఎం బృందం చర్చలు జరపనుంది.
జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై సీఎం రేవంత్‌రెడ్డి బృందం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లోని పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల అపాయింట్‌మెంట్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని ఆయా దేశాల కంపెనీల ప్రతినిధులను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే ఆయా దేశాల్లోని స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ విధానాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది.
మరోవైపు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల ఆఫ్‌లైన్ క్యాంపస్‌ల ఏర్పాటుపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్ కార్యక్రమాల ఏర్పాటుతోపాటు కొన్ని విశ్వవిద్యాలయాలతో ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 10 వరకు పర్యటన కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బృందం అంతకంటే ముందుగానే రాష్ట్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.












