తెలంగాణలో మారుమూల పల్లెలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక చేపట్టింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో రూ.16,007.56 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తొలి దశలో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల ద్వారా రాష్ట్రంలోని 96 నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. మొదటి విడతలో దాదాపు 90 శాతం నిధులను ఇప్పటికే ఉన్న రహదారుల ఆధునీకరణ పనులకే ప్రాధాన్యంగా కేటాయిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ములుగు నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరణతో పాటు రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన అనుసంధానం కల్పించేలా రహదారులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేశారు. క్షేత్రస్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రజల అవసరాలు, రహదారుల ప్రాధాన్యత, కనెక్టివిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్లను గుర్తించారు.

రహదారి నిర్మాణ, అభివృద్ధి పనులను 30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా రైతు పొలం నుంచి పంటను మార్కెట్‌కు చేర్చేందుకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, రోగులు ఆసుపత్రులకు చేరేందుకు కీలకమైన వారధులుగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మెరుగైన రహదారి కనెక్టివిటీతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడతాయని అధికారులు చెబుతున్నారు.