
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి(యూఎస్‌ఏ ఆఫ్ బిజెపి) ఆధ్వరంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్యమైన పురోగతి సాధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75 విమానాశ్రయాలు ఉండగా, ఎన్డీఏ పాలనలో వాటిని 150కు పెంచి ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసింద న్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని రాంచందర్ రావు తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా వందే భారత్ రైళ్లు, ఆయుష్మాన్ భారత్, పిఏం ఆవాస్యేజనా, జల్ జీవన్ మిషన్, పిఏం కిసాన్ వంటి పథకాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.








