కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను ఎత్తి వేయాలన్న కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు విమర్శించారు. బిసి రిజర్వేషన్ల కోసం ఈ నెల న (సోమవారం) తాము మహా ధర్నా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. తాము చేపట్టే ఈ ధర్నాకు అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, బిసి కుల సంఘాలూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో కోరారు. ఎక్కడైనా రిజర్వేషన్ల సాధన కోసం ధర్నాలు నిర్వహిస్తారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రోత్సాహంతో కొంత మంది రిజర్వేషన్లు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

దేశంలో అమలవుతున్న బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లను ఎత్తి వేయాలని ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం ఇక్కడి నుంచే ఆరంభమవుతుందని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్లు ఎలా ఎత్తివేస్తారో 60 శాతం జనాభా ఉన్న బిసిలు చూస్తారని ఆయన సవాల్ చేశారు. రిజర్వేషన్ ఎత్తి వేయాలనుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేయించారని విహెచ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బిజెపి, కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం దారుణం అని విహెచ్ విమర్శించారు.