న్యాయం కోసం బాధితురాలు స్టేషన్‌కు వెళ్తే కేసు నమోదుకు ఎనిమిది గంటలా?

కాంగ్రెస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం: హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదై.. 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా..? అని అడిగారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.