ఢాకా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ వర్చువల్‌గా పాల్గొనడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. మోటర్ సైకిళ్లపై వచ్చిన కొందరు దుండగులు.. క్రికెటర్ ఇంటిపై బాంబులు వేశారు.

భారీ శబ్ధంతో మంటలు రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటను ఆర్పివేసి ఆస్తి నష్టం జరగకుండా చేశారు. ఆ సమయంలో షకీబ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. మళ్లీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. షకీబ్ ఇంటి వద్ద సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున షకీబ్ ఎంపిగా గెలిచిన సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో ఆతడి పదవి కూడా పోయింది.