15 రోజుల్లో ప్రక్రియ పూర్తి

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాలో చేరిక

జూన్ 1 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం

సిఎం సువేందు అధికారి నేతృత్వంలో కేబినెట్ తొలి నిర్ణయాలు

మేనిఫెస్టోలో హామీల అమలు దిశగా అడుగులు

కోల్‌కతా : ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో సోమవారంనాడు జరిపిన పశ్చిమ బెంగాల్ తొలి మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం భూమిని బిఎస్‌ఎఫ్‌కు తక్షణమే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టి తీరుతామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రధానంగా హామీ ఇచ్చింది.

ఈ హామీ అమలు దిశగా సువేందు సర్కార్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో సువేందు మాట్లాడుతూ.. -బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్‌కు అవసరమైన భూమి బిఎస్‌ఎఫ్ నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బిఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. సరిహద్దు ఫెన్సింగ్‌ను బిఎస్‌ఎఫ్ సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసి అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తుందని సువేందు వివరించారు.

ఇంకా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ఆయుష్మాన్ ఆరోగ్య బీమా సహా మరిన్ని పథకాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరుతుందని వెల్లడించారు. సూళ్లలో కొలువుల భర్తీకి వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. తద్వారా లక్షలాది మంది మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఇది తోడ్పడుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.