
నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ (బొద్దింకల) జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తం మీద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విపక్షాలకు తలవంచని ప్రధాని మోడీ ఈ ఆందోళనలతో తలవంచుకోవలసి వచ్చింది. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇక ఎన్‌డిఎ మంత్రులంతా ఈ ఆందోళనలను ఎలా నివారించాలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్‌తోసహా ఇతర విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి, మంగళవారం ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణల తరువాత జంతర్‌మంతర్ వద్ద నిరసనకారుల శిబిరాలను, వేదికను పోలీసులు తొలగించినప్పటికీ బుధవారం ఉదయం నుంచి మళ్లీ తండోపతండాలుగా నిరసనకారులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగిస్తున్నారు. భద్రత దృష్టా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రెండో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధమై కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించినా, కేంద్ర మంత్రి జెపి నడ్డా నివాసానికి వెళ్లి చర్చలు సాగించడానికి కాక్రోచ్ నాయకులు ఒప్పుకోలేదు. తమ డిమాండ్లపై చర్చించాలంటే మంత్రులే జంతర్‌మంతర్ ప్రజావేదిక వద్దకు రావాలని గట్టిగా సమాధానం ఇచ్చారు.
జులై 20న తాము నిర్వహించిన నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గత 25 రోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్ ఆరోగ్యం దృష్టా దీక్షను విరమించాలని కాక్రోచ్ జనతా పార్టీ సంస్థాపకుడు అభిజిత్ దీప్కే విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న ఈ ఉద్యమం ఏమాత్రం బలహీనపడబోదని వాంగ్‌చుక్‌కు తన ఎక్స్ ఖాతా నుంచి స్పష్టం చేశారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించేలా ఒప్పించేందుకు ప్రతిపక్ష ఎంపిలు గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రికి వెళ్లడానికి సిద్ధమౌతున్న తరుణంలో అభిజిత్ దీప్కే విజ్ఞప్తి వెలువడడం గమనార్హం. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఈ నిరసనలపై విపక్ష ఎంపిలు ప్రముఖంగా ప్రస్తావించడం, నిరసనకారులపై క్రూరంగా పోలీసులు లాఠీఛార్జి జరిపినందుకు వారిపై చర్యలు తీసుకోవడం ఇవన్నీ జరిగితేనే తాను దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ చెబుతున్నారు. ఒకపక్క విపక్ష ఎంపిలు, వివిధ వర్గాల నుంచి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్న తరుణంలో స్పీకర్ ఓం బిర్లాతో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
బహుశా ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి సూచిస్తోంది. మోడీ మాత్రం ఈ విషయంలో విపక్షాలకు క్రెడిట్ దక్కకూడదన్న ఎత్తుగడలతో మంగళ్ మిలన్ పేరిట మంగళవారం నిర్వహించిన ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపిలకు తగిన సూచనలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ మహాపాపం అని, అత్యంత ఘోరమని చాలా బాధను వ్యక్తం చేశారు. లీకేజీకి బాధ్యులైన వారిని ఇప్పటికే ప్రభుత్వం కటకటాల్లోకి నెట్టడం జరిగిందన్నారు. మే 3 న నిర్వహించిన నీట్ పరీక్ష రద్దయిన రెండున్నర నెలలకు ప్రధాని మోడీ మొట్టమొదటిసారి ఇలా స్పందించడం విశేషం. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో పరీక్షల్లో అవకతవకలు జరగడం ఒక్కసారి కాదు. వరుసగా అనేక తప్పులు జరిగాయి. అభ్యర్థులను చెప్పలేని కష్టాల్లోకి నెట్టాయి. రాహుల్ గాంధీ వెల్లడించినట్టు గత పదేళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. అంటే నెలకు దాదాపు ఒకటి వంతున జరుగుతున్నట్టే. ఈ కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయి. అందుకనే విద్యామంత్రి, ప్రభుత్వం తమ తప్పులకు జవాబుదారీతనంగా ఉండాలని, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
అయితే రాజకీయ కోలాహలంలో విద్యార్థుల నిరసన గళాలు ఎవరికీ వినిపించకుండా పోతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని శాంతియుతంగా తమ గళం వినిపించే యువతపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు. ప్రశ్నపత్రాల లీకేజీ కేవలం పాపం అనడం ప్రధాని మోడీ తప్పిదమే అవుతుంది. ఆయన పాలనలో ఇది క్షమించరాని నేరం కూడా. దీనికి ఆయన తప్పకుండా తగిన చర్యలు తీసుకుని లోపాలను సరిదిద్దవలసి ఉంది. ఇది రాజకీయ సమస్యకాదు, జాతీయ సమస్య అని ప్రధాని మోడీ సూచించడం నూటికి నూరు పాళ్లు వాస్తవం. దీన్ని పరిష్కరించడం ఆయన శక్తికి మించిందేమీ కాదు. ప్రకృతి వైపరీత్యంలా నియంత్రించలేని అసాధ్యమేమీ కాదు. పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలో అవినీతి పేరుకుపోయి కుళ్లిపోవడం వల్లనే ఇది జరిగింది. ఈ సమస్యను సాధారణ సమస్యగా చూపించి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోలేదు. రానురాను ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చక ముందే కేంద్ర విద్యామంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, సమర్థులైన విద్యావేత్తను ఆ పదవిలో నియమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకోవడం తక్షణ కర్తవ్యం. ప్రజాస్వామ్యం ఎప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం లేదా కార్యాచరణను అభిలషిస్తోంది. అలాగే పరీక్షల రద్దువల్ల కలిగిన ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలన్నిటికీ ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే న్యాయం అందజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటేనే తప్ప ప్రధాని మోడీ పార్టీ ఎంపిల సమావేశంలో చెప్పిన మాటలకు ఎలాంటి విలువ ఉండదు.











