ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలో దూకారు. వంతెనపై తమ చిన్నారిని ఉంచి భార్యాభర్తలు నదిలోకి దూకినట్లు గ్రామస్తులు తెలిపారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయి కృష్ణ అలియాస్ డీవీడీ (32), ఆయన భార్య శిరీష (28)లు నదిలో దూకినవారుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డీవీడీ గతంలో గల్ఫ్‌కు వెళ్లి కొన్నేళ్ల పాటు పనిచేశారని..అనంతరం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకున్నారని చెప్పారు. కొంతకాలం హైదరాబాద్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత వేల్పూరు గ్రామంలో రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వహించారని తెలిపారు.

వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఇంటిని కూడా విక్రయించినట్లు స్థానికులు వివరించారు. రెండు నెలలుగా భీమవరంలోని డీవీడీ పిన్ని ఇంట్లో ఆ దంపతులు ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడివుంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. గల్లంతైన దంపతుల కోసం గజ ఈతగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలీసులు కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. భార్యాభర్తలు తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయానికి అప్పుల బాధే కారణమా? లేక మరేదైనా కుటుంబ సమస్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.